అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ట్విటర్‌లో ఓ ఆసక్తికరమైన వీడియోను పోస్ట్ చేశారు. విషయానికొస్తే.. జేసీబీని సాధారణంగా మట్టి తవ్వకాలకు, ఇళ్లను కూల్చడానికి, బండరాళ్లను ఎత్తడానికి, ఇంకా అనేక పనులకు ఉపయోగిస్తుంటాం. కానీ గుజరాత్‌లో మాత్రం కొందరు మహిళలు డీసీఎం వాహనంలో నుంచి దిగడానికి జేసీబీని ఉపయోగించారు. ఆ సమయంలో ఆ మహిళలు కూడా నవ్వుఆపుకోలేకపోవడం మనం వీడియోలో గమనించవచ్చు.
ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన ఓ వ్యక్తి 'జేసీబీని కనిపెట్టిన వ్యక్తి ఎప్పుడూ బహుశా ఇప్పటిదాకా గుజరాత్‌లో పర్యటించి ఉండకపోవచ్చు.. తన ఆవిష్కరణలను ఇలా ఉపయోగించుకుంటారని ఎన్నడూ ఊహించకపోవచ్చు' అంటూ ట్వీట్ చేశారు. దీనిని ఐవైఆర్ రీట్వీట్ చేస్తూ.. ఆవిష్కరణలకు ప్రజలు మార్పులు చేస్తే అటువంటి ఆవిష్కరణలు మరింత అద్భుతంగా ఉంటాయి' అంటూ పేర్కొన్నారు.